ఒకానొక ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వుండేవారు, వాళ్ళిద్దరికీ ఒక రోజు ఒక అరటి పండు విషయంలో గొడవ మొదలయ్యింది, ఇద్ధరూ అరటి పండు తమదంటే తమదేనని అరుచుకుంటున్నారు, విషయం యెన్థకీ తేలడం లేదు .
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక కోతి వచ్చి అరటి పండు ఎత్తుకొని అక్కడే వున్న ఒక చెట్టు ఎక్కి ఎవరికీ అందని ఓ కొమ్మ పై కూర్చొంది.
కొమ్మకి ఒక వైపు అన్న, ఇంకో వైపు తమ్ముడు నిల్చున్నారు. ఇద్ధరూ ఆ అరటి పండు తమకే ఎలా చెందుతుందో వివరించారు, తమ దగ్గరున్న చారిత్రక సాక్ష్యాలు చూపారు, నివేదికలు ఇచ్చారు, ఒకడుగు ముందుకేసి అరటి పండు తమకిస్తే కోతికి కలిగే లాభాలు కూడా చెప్పారు. కోతి అన్నీ వింటూ గొమ్మున కుర్చోనుంది.
కొంతసేపటికి అన్న ఆదమరచి కొంచెం అలసి పోయి వున్నవేల, తమ్ముడు అరటి పండు తనకివ్వకపోతే తాను చచ్చిపోతానని, ఆ పాపం కోతికీ చుట్టుకుంటుందని బెదిరించాడు. ఏమి ఆలోచించిందో కానీ కోతి అరటి పండు తమ్ముడికే ఇస్తానని ప్రకటించింది.
ఇక అన్న దులుపుకొని తన వాదన పెంచాడు, గోల చేసాడు, రిలే నిరాహారదీక్షలు చేసాడు, ఇంత ఆగం అవుతుందని ఊహించని కోతి ముందుగా ప్రకటించినట్టు కాకుండా అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొంటానని ప్రకటించింది.
ఇక అన్నదమ్ములు ఇద్ధరూ మొదలెట్టారు, అరటి పండు పుట్టు పుర్వోతరాలు తవ్వారు.
అన్న : అరటి పండు నా పొలం లో వున్న చెట్టుకే కాసింది. కాబట్టి పండు నాదే
తమ్ముడు: అన్న చెబుతున్న అరటి చెట్టు విత్తు నా పొలం నుంచీ వచ్చింది, కాబట్టి పండు నాదే.
అన్న: విత్తు తమ్ముడిదే అయ్యుండొచ్చు, కానీ చెట్టుని ఇన్నాళ్ళు ఎరువులేసి పెంచి పెద్ద చేసింది నేను, కాబట్టి పండు నాదే
తమ్ముడు: అన్న ప్రత్యేకంగా చేసిందేం లేదు, నా పొలం లోని విత్తు సహజం గానే బలమయినది, ఏ సారం లేకపోయినా పెరిగుండేది, కాబట్టి పండు నాదే.
ఇలా సాగుతున్నాయ్ వాదనలు.
ఈ గొడవంతా దారిన పోయె ఒక పిచ్చి వాడు ఆసక్తిగా, వింతగా చూస్తున్నాడు. వాడికిదంతా బాగా రంజుగా వుంది.
ఇ గొడవంతా తట్టుకోలేక కోతి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది.
ఇక అప్పుడు అన్న, తమ్ముడు, కోతి, పిచ్చాడు మాత్రమెయ్ కాకుండా మేధావి వర్గం అనే ఒక కొత్త వర్గం ఈ గొడవలోకి ప్రవేశించింది.
ఆ మేధావి వర్గంలో ఒక అపర మేధావి మాత్రం మిగతా అందరిలా కాకుండా కొంచెం ప్రత్యేకంగా మాట్లాడేవాడు, అస్సలు ఆ కోతి అలా ఎందుకు చేస్తోందో, అన్నదమ్ములు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చెయ్యకపోతే ఇంకా బాగుంటుందో, ఏ విధంగా చేస్తే విషయం పరిష్కారం అవుతుందో ... అన్నీ అనర్గళంగా చెప్పేవాడు. పిచ్చాడికి ఈ అపర మేధావి మాటలు బాగా నచ్చాయి.
ఈ అపర మేధావికి కోతి ఏం చేసినా అందులో ఏదో మర్మం కనపడేది,
కోతి ఒక సందర్భంలో తోక తమ్ముడు వైపు, అరటి పండు అన్న వైపు పెట్టి కూర్చొంది
అపర మేధావి: చూసారా కోతి అరటి పండు తమ్ముడికి ఇవ్వనని చేతల ద్వార చూపిస్తోంది
ఇంకో సందర్భంలో కోతి అన్న వైపు తిరిగున్నప్పుడు ఆవలించింది,
అపర మేధావి: కోతి అన్నని నిదురపో, నేను చూసుకుంటానని తన చేతల ద్వార చెబుతోంది.
ఈ విధంగా కోతి ఏం చేసినా అందులో ఏదో కనపడేది అపర మేధావి గారికి, ఇది వింటున్న పిచ్చాడు, అబ్బో కోతి చాలా తెలివయినదని అనుకొన్నాడు.
ఇలా సమయం గడచి పోతూ వుంది .............
కొంత సేపటికి విసిగి పోయిందో, ఏం అనుకుందో ఏమో కానీ, కోతి ఒక సందర్భంలో అరటి పండు పైకి ఎత్తి పట్టుకొని తమ్ముడి వైపు విసురుతున్నట్టు చూపించింది..
అందరూ ఇక అయిపోయింది, అరటి పండు తమ్ముదికిచ్చేస్తోంది అని అనుకొన్నారు.. అపర మేధావి గారు మాత్రం, అబ్బే ఇది జరిగే పని కాదు, ఎన్ని చూడలేదు, నా ఉద్దేశం అరటి పండుని అలా పైకి ఎత్తి పట్టుకొంది తమ్ముడికి ఇవ్వడానికి కాదు, పైనున్న కొమ్మ పై పెట్టడానికి అని అన్నారు.
ప్రజలు, పత్రికలు అన్నీ అరటి పండు తమ్ముడికి కాయం అనుకొన్నారు, కానీ ఈ పిచ్చాడు మాత్రం అపర మేధావి గారినీ నమ్మాడు, యెమీ జరగదనుకొన్నాడు.
వన్ ఫైన్ డే, కోతి అరటి పండు తమ్ముడికివ్వాలని నిర్ణయం తీసుకొన్నానని, తొక్క కావాలంటే అన్న తీసుకోవచ్చునని ప్రకటించింది.
అపర మేధావి గారు గప్ చుప్ అయిపోయ్యారు..
ఈ పిచ్చాడు ఖంగు తిన్నాడు.
అన్న గోల పెంచాడు, అరచి పీకి పందిరేసాడు...అరటి పండు ఎవరికిస్తావో తరువాత, ముందు అస్సలు నీకున్న అధికారం ఏమిటి చెప్పు, దేని ఆధారంగా అరటి పండు తమ్ముకివ్వాలని ప్రకటించావో వెల్లడించు అని గొడవ చేసాడు.
కోతికి దిక్కు తోచలేదు, విషయం ఎక్కడ మొదలయ్యిందో చివరికి మళ్లీ అక్కడికే చేరింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం లా తయారయ్యింది కోతి పరిస్థితి.
చివరిగా చెప్పవలసిన అవసరం లేకపోయినా చెప్పవలసిన పోలికలు:
అన్న: సీమంధ్ర
తమ్ముడు: తెలంగాణ
కోతి: కాంగ్రెస్ అధిష్టానం
అపర మేధావి: అది మీరే అండి greatandhra-mbs గారు
పిచ్చాడు: అది నేనే
--------------------------------------------------------------------
ఇంతలో అపర మేధావి గారు, అస్సలు కోతి అరటి పండుని కొంచెం అటు ఇటు గా సగం తమ్ముడుకి, సగం అన్నకి పంచితే గొడవ తీరిపోయే అవకాసం వుంది కదా అని సెలవిచ్చారు, పిచ్చాడి ముఖం మళ్లీ వికసించింది, ఇంత సులభమయిన ఆలోచన కోతికి ఎందుకు రాలేదా అని అనుమానం వేసింది, ఎంతయినా మేధావి మేధావే అనుకొన్నాడు.
--------------------------------------------------------------------------
నా అనుమానం అస్సలు అక్కడ అరటి పండు ఇంకా వుందా, వుంటే సమంగా రెండు బాగాలుగా విభజించే స్థితిలో వుందా, వున్నా కూడా అస్సలు కోతికి ఎప్పటికయినా అన్నదమ్ముడిలో ఎవరికయినా అరటి పండు ఇచ్చే ఉద్దేశం వుందా...
ఏమో ఎవరికి తెలుసు..... కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని అంటారు.. కానీ పరిస్థితి చూస్తుంటే ఈ అరటి పండు ప్రశ్నకి సమాధానం కాకి ఎత్తుకెళ్ళిపోయిందనిపిస్తొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి