22, సెప్టెంబర్ 2014, సోమవారం

చేదెవరికి....

నాకు తను మళ్లీ మళ్లీ గుర్తొస్తోంది.... ఎంత మరచిపోవాలనుకొంటుంటె అంత గుర్తొస్తోంది......
ఎలా మరచిపోవాలో తెలియట్లేదు...
.................................................. ..................................................
నాకు బాగా గుర్తు ... తొలిసారి తనని చూసిన క్షణం, తొలి చూపులో ప్రేమ పుడుతుందో లేదో తెలియదు కానీ తనని తొలి సారి చూడగానె నా మనస్సు స్పందించింది. మనలో మన మాట, అప్పట్లో చాలా మంది అమ్మాయిలను చూసి మనస్సు స్పందించింది, కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు స్పందనలందు కొన్ని స్పందనలు వేరేగా వుంటాయ్ , ఆ విషయం తెలియటానికి కొంచెం టైం పడుతుంది.

నల్లని పొడవయిన జుట్టు, బహుశా అమావాస్యంత నల్లనయిన, సెలయేరంత పొడవయిన కురులు అనాలేమో ...
యెప్పుడూ పళ్ళు కనిపించేలా నవ్వు, బహుశా వెన్నెల కురిపిస్తునట్టు లా వుండే దరహాసం అనాలేమో ...
 చామన ఛాయ రంగు, బహుశా నీలి మేఘ శ్యామ వర్ణం అనాలేమో ....
చూడగానే కొట్టొచ్చినట్టు వుండే నల్లని బొట్టు, బహుశా రెండు కొండల మధ్య ఉదయిస్తునట్లు అగుపించే సూరీడు లాంటి బొట్టు అనాలేమో ....

ఇంకా ఎలా వర్ణించాలి, నేను కవిని కాదు కాబట్టి సరిపోయింది , నాకు కవిత్వం రాదు కాబట్టి మీరు బ్రతికి పోయారు, లేకుంటే వేమన శతకం, సుమతి శతకం లాగ తన గురించి ఓ పది శతకాలు వ్రాసి పారేసుండే వాడిని, సారీ వ్రాసి దాచుకొనే వాడిని.

అలాంటి అమాయిని పట్టుకొని (అంటే నిజం గా పట్టుకోలేదు లే), మా గిరి గాడు, యహే 'below average' రా అనేసరికి , ఛీ ఈడా నా స్నేహితుడు, ఈడితోనా నేను చిన్నప్పటి నుంచి స్నేహం చేసింది అని వాడి జీవితం మీద , వాడితో నా స్నేహం మీద అసహ్యం వేసింది.
(మనలో మన మాట, 'super figure' రా అన్న మా వాసు గాడి పైన అంత కంటే ఎక్కువ అసహ్యం వేసింది.... )

ఎంత జుట్టు పీకొన్నా తనతో పరిచయం పెంచుకునే దారి కనపడలేదు, అదేంటో  సినిమాల్లో హీరోయిన్ కి ఏదయినా కష్టం వస్తే హీరో కాపాడతాడు కదా, కానీ అదేంటో నా దరిద్రపు సినిమా, తనకి ఏ కష్టమూ రాలేదు, నాకు కాపాడే అవకాశమూ రాలేదు...

అయినా తనతో ఎలాగయినా పరిచయం పెంచుకొందామన్న ప్రతి సారీ మా ఇంటిలో నా ప్రధమ శత్రువు నన్ను వెనక్కి లాగి పడేసేది... అదంటే నాకు పరమ అసహ్యం,
ఎలుక కి పిల్లి అంటే ఎంత అసహ్యమో
కప్పకు పాము అంటే ఎంత అసహ్యమో
నార్త్ కొరియా వాళ్లకి సౌత్ కొరియా వాళ్ళంటే ఎంత అసహ్యమో
సోనియా గాంధీ కి నరేంద్ర మోడీ అంటే ఎంత అసహ్యమో
అంత కంటే కూడా నాకు అదంటే అసహ్యం, అది మా ఇంట్లో అద్దం.
ఛీ మరీ అంత నిజం గా చూపించాలా.. నన్ను కొంచెం చిరంజీవి లానో, నాగార్జున లానో చూపించొచ్చు కదా, చూపిస్తే దాని సొమ్మేం పోతుంది, అయిన దాని గురించి ఎందుకు లే , నాకు నచ్చని వాటి గురించి మాట్లాడాలంటే నాకు చచ్చేంత అసహ్యం.
..............................................................................................................
ఇంతలో మా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయ్. మొదటి సారి మా నాన్న నాకు నచ్చిన రోజు అది... నాకు తెలిసి మా నాన్న చేసిన ఓకే మంచి పని అదే. మా నాన్న నాకు పెట్టిన పేరు వల్ల ఆ అమ్మాయి నా వెనుక, నేను తన ముందు...
మానస సరోవరం లో నేను మానసుడు , తను సరోవరం లా
కన్యా కుమారి లో నేను కుమారుడు , తను కన్య లా
జమ్మూ&కశ్మీర్ లో నేను జమ్మూ, తను కాశ్మీర్ లా
కింగ్స్&క్వీన్స్ (అది మా school పేరు లే) లో నేను కింగ్, తను క్వీన్ లా ..
ఇంకా ఏదేదో అనిపించేసింది, ఛ నేను కవిని కాదు కాబట్టి సరిపోయింది , నాకు కవిత్వం రాదు కాబట్టి మీరు బ్రతికి పోయారు.

అంతలో ఎగ్జామ్స్ చివరి రోజు వచ్చేసింది, ఆ రోజు maths ఎగ్జాం. దేవుడు ఆలస్యం గా ఇచ్చినా మోయలేనంత ఇస్తాడు అన్నట్లు (ఆరి పోయే దీపానికి వెలుగెక్కువ అని ఆ తరువాత తెలిసింది లే) , ఆ రోజు మొదటి సారి తను నాతో మాట్లాడింది. ఎగ్జామ్ మధ్యలో మెల్లగా పిలిచింది, యెవరో పిలుస్తున్నట్టు వుందే అని వెనక్కి తిరిగి చూస్తే , తనే, నా క్వీన్, నా కన్య, నా సరోవరం, నా కశ్మీర్..... ప్లీజ్ కొంచెం చూపించు అని అడిగింది.... ఆహ కోటి వరాలు ఇవ్వటానికి రెడీ గా వున్న దేవుడిని పిలిచి నాకు maha lacto చాక్లెట్ ఇస్తావా అని అడిగినట్టనిపించింది. ఇక నా పరిస్థితి చూడాలి... తొమ్మిదో నెంబర్ మేఘం పై కూర్చొని, కోటి వీణలు వాయిస్తూ, అమృతం తాగుతునట్టు.. ఇంకా ఏదేదో అనిపించేసింది ...
ఛ నేను కవిని కాదు కాబట్టి సరిపోయింది , నాకు కవిత్వం రాదు కాబట్టి మీరు బ్రతికి పోయారు.
.......
ఎగ్జాం అయిన తరువాత తను నాకు థాంక్స్ చెప్పటం , నేను fanta ఎద్దు లాగ తల వూపటం, అంతా ఏదో కలలో జరిగినట్టు జరిగిపోయింది.

ఆ తరువాత తను మళ్లీ కనిపించలేదు, నేను తనని మర్చిపోనూ లేదు.
అయినా తియ్యని జ్ఞాపకాలు మర్చిపోవాలని కోరుకోవడం ఎందుకు, మర్చిపోలేకపోతే బాధ పడడం ఎందుకు.
తియ్యని జ్ఞాపకం తియ్యగానే వుండనీ....... చేదెవరికి.